నేత్రపర్వంగా వెంకన్న వినోదోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా వెంకన్న వినోదోత్సవం

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

నక్కపల్లి : ఉపమాక వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగాబుధవారం వినోదోత్సవం, చక్రస్నానం, లక్ష్మిసంవాదం నేత్రపర్వంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి ఉంగరం మాయంకావడం, దాన్ని వెతికే సన్నివేశం భక్తులను ఆకట్టుకున్నాయి. భారీవర్షం కారణంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. ఈ సందర్బంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రోలు,రోకలి, డోలు, కత్తిలకు పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉభయదేవేరులతో స్వామివారిని పుణ్యకోటి వాహనంపై ఊరేగించారు. అర్చక స్వాములు స్వామివారి ధనుర్భాణాలను సంధించే ఘట్టం భక్తులను ఆకట్టుకుంది.

స్వామి వారి ఉంగరం మాయం..

ఎవరు తీశారో చెప్పండి...

వేంకటేశ్వరస్వామి ఉంగరం పడిపోయింది...మీలో ఎవరు తీసారో చెప్పాలంటూ అర్చక స్వాములు వినోదోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను ఆపి నిలదీయడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఉంగరం మేం తీయలేదంటూ మేం తీయలేదు, మాకు దొరక లేదంటూ అందరూ చెప్పినప్పటికీ అర్చకులు వినలేదు. అనుమానంతో కొంతమంది భక్తులతో పాటు, ఒకరిద్దరు టీటీడీ ఉద్యోగులను బంధించి ఉంగరం గురించి గట్టిగా ఆరాతీయడంతో ఏం చేయాలో తెలియని పరిస్దితి ఏర్పడింది. బ్రహ్మోత్సవాలకు వచ్చిన వారే స్వామివారి ఉంగరం కాజేసారంటూ అర్చకులు నింద మోపడంతో బాబోయ్‌ మాకేం తెలియదంటూ బిక్కమొహాలు వేశారు. అందరి సమక్షంలో వెతికినప్పటికి ఎంతకీ ఉంగరం కనిపించకపోవడంతో చివరగా స్వామివారి ధరించిన వస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో ఉంగరం లభించింది. ఉంగరం దొరికిందని.. మీరెవరూ కంగారు పడొద్దని అర్చకులు చెప్పడంతో అంతా ఊపిిరి పీల్చుకున్నారు. ఇదంతా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగమైన వినోదోత్సవమని తెలిసి భక్తులంతా ఆనంద పరవశుయ్యారు.

అలరించిన లక్ష్మీ సంవాదం

అనంతరం ఆలయంలో లక్ష్మీ సంవాదం కార్యక్రమం జరిగింది. (ఆలయంలోకి స్వామివారి ప్రవేశాన్ని ఉభయ దేవేరులు అడ్డుకుంటారు. మీరెవరో చెప్పాలని పట్టుబడతారు. తాను శ్రీవేంకటేశ్వరస్వామినని చెప్పడంతో శ్రీదేవీ, భూదేవీ స్వామివారిని గర్భాలయ ప్రవేశానికి అంగీకరిస్తారు.) తదుపరి కొట్నాల ఉత్సవం, చూర్ణోత్సవం నిర్వహించి, చూర్ణాన్ని భక్తులపై జల్లారు. ఆలయంలోనే చక్రవారి స్నానం నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం అద్దపు సేవ, కంకణ విసర్జన, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో ప్రధానార్చకులు వరప్రసాదాచార్యులు, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, గోపాలాచార్యులు, రాజ గోపాలాచార్యులు, సాయిఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement