వేలం పాటలో రూ. 50వేలకు దక్కించుకున్న భారీ లడ్డూను చిమ్మినాయుడుకు అందజేస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులు
చోడవరం : చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలో భాగంగా భారీ లడ్డూను వేలం వేశారు. నవరాత్రి ఉత్సవాల్లో 50 కేజీల భారీ లడ్డూను స్వామివారికి ప్రసాదంగా ఉంచారు. ఈ లడ్డూను వేలం వేయడం ఏటా వస్తున్న సంప్రదాయం. ఈ ఏడాది కూడా 50కేజీల లడ్డూను దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిరణ్మయి, ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు, ఆలయ కమిటీ చైర్మన్ మంగ శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎన్.గనిరెడ్డి పర్యవేక్షణలో లడ్డూను వేలం వేశారు. పెద్దసంఖ్యలో ఈ లడ్డూ వేలంలో భక్తులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శరగడం చిమ్మినాయుడు ఈ భారీ స్వామివారి లడ్డూను రూ. 50 వేలకు దక్కించుకొన్నారు. లడ్డూను భక్తులందరికీ ప్రసాదంగా పంపిణీ చేయాలని చిమ్మినాయుడు ఆలయ కమిటీకి అప్పగించారు.


