తుమ్మపాల : ఆయుర్వేద వైద్య సేవా కార్యక్రమాల్లో మరో రెండు ప్రపంచ రికార్డు గుర్తింపులు లభించాయని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు డాక్టర్ టి. సుందర రాజ్ పెరుమాల్ తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతి సందర్భంగా అనకాపల్లి మండలం కొడూరులో విశ్వ ఆయుర్వేద పరిషత్, వరము చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత జలౌకావచారణ శిబిరంలో 142 మంది రోగులకు చికిత్స అందించడంతో ది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించి రికార్డు ధ్రువీకరణ అందించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ రికార్డు గుర్తింపులు ఒక్క వ్యక్తికి సంస్థకు మాత్రమే దక్కిన గౌరవం కాదని, వైద్యులు, థెరపిస్టులు,వలంటీర్లు, రోగులు, సేవాభిమానుల సమష్టి కృషికి దక్కిన గుర్తింపు అని అన్నారు. భవిష్యత్తులోనూ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. చరక జయంతి సందర్భంగా ఆగస్టు 16 నుంచి 18 వరకు ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన మెగా అగ్నికర్మ కార్యక్రమంలో 210 మంది రోగులకు చికిత్స అందించామన్నారు. గతంలో నిర్వహించిన మెగా వస్తి కార్యక్రమంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించామని, స్వల్ప వ్యవధిలోనే మూడు భారీ స్థాయి ఆయుర్వేద వైద్య సేవా కార్యక్రమాలకు ప్రపంచ రికార్డు గుర్తింపు లభించడంపై ఆనందం వ్యక్తం చేసారు. 548 మందికి ఉచిత వస్తి కర్మ, 210 మందికి అగ్నికర్మ, 142 మందికి జలౌకావచారణ చికిత్సలు అందించామని, ఆయుర్వేదంలోని ప్రాచీన చికిత్సా విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు అందించడం, ఆయుర్వేదంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో బీజెపీ జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు, డాక్టర్ ఎన్. ఆంజనేయమూర్తి పాల్గొన్నారు.


