కశింకోటలో హజరత్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖాదరీ బాబా చందనోత్సవ ఊరేగింపు
కశింకోట: హజరత్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖాదరీ బాబా ఉరుసు ఉత్సవాలు(చందనోత్సవం) కొనసాగుతున్నాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం నిర్వహించిన చందనోత్సవంలో దర్గా నుంచి డప్పులు, వాయిద్యాలతో గుర్రంపై సంప్రదాయబద్ధంగా చందనాన్ని ఉంచి జెండాలతో ఊరేగించారు. ఈ ఊరేగింపులో ముస్లింలతోపాటు ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు, స్థానిక హిందువులు భారీగా పాల్గొన్నారు. దర్గా నుంచి పెద్దబజారు, సంతబయలు, జాతీయ రహదారి మీదుగా ఖాదరీబాబా నివాసం వరకు ఊరేగింపును నిర్వహించి, అనంతరం తిరిగి దర్గా వరకు తీసుకువచ్చారు. తుపాను ప్రభావంతో వర్షం కురుస్తున్నప్పటికీ ఊరేగింపు నిరాటంకంగా కొనసాగింది. భక్తులు చందనాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.


