అచ్యుతాపురం రూరల్ : విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సోమవారం జరిగిన ఆందోళన సందర్భంగా పోలీసుల లాఠీచార్జీ ఘటనను వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు చోడిపల్లి అప్పారావు ఖండించారు. ఈ ఘటనలో వైఎస్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు డా.పూనూరు గౌతమ్‌రెడ్డిపై లాఠీచార్జీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కులను హరించడం సరికాదన్నారు. ఘటనపై ప్రభుత్వం, అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.


