నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ నిధులతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సృష్టి క్షేత్రం ఏర్పాటు చేసి పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు సిహెచ్.విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం అభివృద్ధికి స్పీకర్ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎంపీ నిధులతో నియోజకవర్గంలో ప్రత్యేక లైబ్రరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రెండేళ్లలో మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి జరిగిందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. రూ.25 కోట్లతో పట్టణంలోని ప్రధాన కూడలి నుంచి శ్రీకన్య కూడలి, అబీద్ కూడలి మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ఆధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 40 వార్డుల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మానాన్ని పూర్తి చేయనున్నామన్నారు. అనంతరం నియోజకవర్గంలో రెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఎ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర పాల్గొన్నారు.


