అచ్యుతాపురం రూరల్ : పూడిమడక సముద్రంలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రమైన అచ్యుతాపురం కోనేంపాలెం గ్రామానికి చెందిన లాలం సత్యవతి, అప్పారావు దంపతుల చిన్న కుమారుడు లాలం లక్ష్మణరావు (25) మృతి చెందాడు. తల్లి లాలం సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మణరావుకు కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో బయట తిరుగుతుండేవాడని తల్లి సత్యవతి తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ పూడిమడక రోడ్డువైపు వెళ్లడంతో ఆమె వెంట వెళ్లి పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పరుగెత్తుకుంటూ వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. అనంతరం పూడిమడక గ్రామంలో తిరుగుతూ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సముద్రంలోకి వెళ్లినట్టు తెలిపారు. లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో బలమైన అలల కారణంగా సముద్రంలో మునిగిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం పూడిమడక తీరం వద్ద మృతదేహం కొట్టుకురాగా, అది తన కుమారుడిదేనని గుర్తించినట్టు సత్యవతి తెలిపారు.


