కుండపోత వర్షాలతో వణికిపోతున్న మన్యం
● ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రధాన గెడ్డలు
● ఉధృతంగా గెడ్డలు
● స్తంభించిన జనజీవనం
ఉప్పొంగిన చాపరాయి గెడ్డ.. ప్రవేశద్వారం మూసివేత
డుంబ్రిగుడ: మండలంలో మంగళవారం ఉదయం 5 గంటల నుంచే ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల పంట పొలాలకు తగిన సాగునీరు అందే అవకాశం ఉందని గిరిజన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి వద్ద వరద నీరు భారీ ఎత్తున పొంగి ప్రవహిస్తోంది. ఐటీడీఏ అధికారుల ఆదేశాల మేరకు పర్యాటకులను లోపలికి అనుమతించడం లేదు. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పర్యాటకులు ఎవరూ రావద్దని నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు.
సాక్షి, పాడేరు: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరుతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. మత్స్యగెడ్డకు వరద నీరు భారీగా పోటెత్తింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన మత్స్యగుండం వద్ద బండరాళ్ల మీదుగా మత్స్యగెడ్డ అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
442.9 ఎంఎం వర్షపాతం
జిల్లాలో మంగళవారం 442.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అరకులోయలో 61.9, పాడేరులో 56.4, జి.మాడుగులలో 56.2, అనంతగిరిలో 47.2, గూడెంకొత్తవీధిలో 43, ముంచంగిపుట్టులో 42, హుకుంపేటలో 39.8, పెదబయలులో 34.8, డుంబ్రిగుడలో 30.2, కొయ్యూరులో 18.2, చింతపల్లిలో 13.2మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారవర్గాలు తెలిపాయి.
పెదబయలు: వర్షాలకు మారుమూల ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు మెట్ట పంటల సాగుకు కొంతమేర మేలు చేస్తుండగా... ప్రస్తుతం ’రాజ్‌మా’ పంట వేయడానికి మాత్రం ఇవి అడ్డంకిగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కించూరు గెడ్డ, జామిగుడ, చింతలవీధి, కుంతుర్ల పంచాయతీల పరిధిలోని గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలావుండగా కిముడుపల్లి, కుంతుర్ల పంచాయతీలను అనుసంధానిస్తూ తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వైయస్సార్‌సీపీ నేతలు వంతాల అప్పారావు, పాంగి రామారావు, పాంగి అప్పలకొండ, ఏసుబాబు, కోరాబు కృష్ణపడాల్ కోరారు. కిముడుపల్లి పంచాయతీ మచ్చుపల్లి, కుంతుర్ల పంచాయతీ కన్నెలకట్లు గ్రామాల మధ్య ఉన్న గెడ్డపై వంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
కొయ్యూరు: మండలంలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు వరి సాగు చేసిన రైతులకు ఎంతగానో మేలు చేయనున్నాయి. సాగునీరు అందక కొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్న పంటలకు ఈ వర్షం ప్రాణం పోసింది. కాకరపాడు–కొయ్యూరు ప్రధాన రహదారిపై ప్రయాణం కష్టంగా మారింది. .
ముంచంగిపుట్టు: తుపాను వర్షాల కారణంగా వాగులు, గెడ్డల్లోకి భారీగా వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు, భూసిపుట్టు, దొడిపుట్టు పంచాయతీల పరిధిలోని మారుమూల గ్రామాల్లో వాగులు పొంగిపొర్లాయి. గెడ్డల వద్ద వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల చుట్టూ నీరు చేరింది. దీంతో ఆయా గ్రామాల గిరిజనులు బయటకు రావడానికి వీలులేక ఇళ్లకే పరిమితమయ్యారు.
జి.మాడుగుల: మండలంలో మంగళవారం ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లు, వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా జి.మాడుగుల నుంచి లంబసింగి, పాడేరు వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో, ఆ మట్టి రోడ్డంతా వర్షానికి బురదమయంగా మారింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు.
సీలేరు: జిల్లాలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. గూడెం కొత్తవీధి మండలం సప్పర్ల నుంచి దారకొండ వరకు భారీ వర్షంతో పాటు దట్టమైన మంచు కురుస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాదిగమల్లు, చిన్న గంగవరం, పిల్లిగెడ్డ తదితర వాగులు, గెడ్డల్లో వరద
నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
జర్రాయి– వసమామిడి మార్గంలో పొంగి ప్రవహిస్తున్న గెడ్డ
మూతపడిన చాపరాయి
మచ్చుపల్లి, కన్నెలకట్లు గ్రామాల మధ్య వాగులో బైక్ దాటిస్తున్న గ్రామస్తులు
మత్స్యగుండం వద్ద
ఉధృతంగా గెడ్డ
చోటముఖిపుట్టు వద్ద కల్వర్టుపై చేరిన వరద నీరు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కలెక్టరేట్‌తో పాటు డివిజన్.మండల స్థాయిలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేశామని కలెక్టర్ నిశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కంట్రోల్‌రూమ్‌లో 22వతేదీ బుధవారం ఎం.అర్జున్ (9391319286), ఎల్.చక్రధర్(7095239800), కె.దినేష్‌కుమార్(9440603641), ఎస్.వెంకటబాలు(7382323241), 23వతేదీ గురువారం ఎస్.వసంతరావు (9493415670), ఎస్.దిలీప్‌కుమార్(7981301820), ఏఎస్ చక్రవర్తి(7780137849), 24వతేదీ శుక్రవారం పి.కిరణ్‌కుమార్ (9494372648), పి.సత్యారావు(9014350957).రాజేష్ (912143829), సతీష్(7981056206) 24గంటలు కంట్రోల్‌రూమ్‌లో అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. తుపానుతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురైనా నష్టాలు సంభవించినా కంట్రోల్ రూమ్‌కు వెంటనే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు.


