సాక్షి, పాడేరు: గిరిజన మహిళలంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, త్రీడి ప్రింటింగ్ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ టి.నిశాంతి పిలుపునిచ్చారు. స్థానిక గిరిజన మహిళా సమాఖ్య కార్యాలయంలో డీఎస్టీ, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డీఆర్‌డీఏ సంయుక్త ఆధ్వర్యంలో హస్తకళల్లో త్రీడీ ప్రింటింగ్‌పై ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... త్రీడి ప్రింటింగ్ ద్వారా విభిన్నమైన హస్తకళా రూపాలు, కళాకృతులను తయారు చేయడం ద్వారా మహిళలకు మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ట్రైఫెడ్ ద్వారా తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ, ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకులు డాక్టర్ బి.కీర్తిప్రియ తదితరులు పాల్గొన్నారు.


