కూటమిలో చిచ్చు పెట్టిన రైతు సేవా కేంద్ర భవనం ప్రారంభోత్సవం
ఎమ్మెల్యే నుంచి తమకు ఆహ్వానం లేదని
టీడీపీ నేత విజయబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల నిరసన
ప్రారంభోత్సవం రద్దు చేసుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్
యలమంచిలి రూరల్ : నియోజకవర్గంలోని యలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సోమవారం చోటు చేసుకున్న విభేదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రం భవనం ప్రారంభోత్సవానికి తమకు జనసేన ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం లేదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కొలుకులూరి విజయబాబు, ఇత్తంశెట్టి రాజు, రాజాన వెంకటరమణ, రాజాన వెంకునాయుడు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు రెడ్డి నానాజీ, ఇత్తంశెట్టి సూరిబాబు తదితరులు పాత రామాలయం దగ్గర మౌన దీక్షతో నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగమైన తమను పక్కన పెట్టి కేవలం జనసేన నేతలతోనే ప్రారంభోత్సవం చేయడానికి యత్నించడం తమకు తీవ్ర అవమానకరమంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ వెళ్లే మార్గం పక్కనే టీడీపీ నేతలు నిరసనకు దిగడంతో యలమంచిలి రూరల్ పోలీసులు నిరసన శిబిరం వద్దకు చేరుకుని ఉద్రిక్త పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, జనసేన నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత విజయబాబు ఆరోపించారు. టీడీపీ నేతలు తమ నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వివరాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం విశేషం. దీంతో జనసేనతో అటో ఇటో తేల్చుకోవడానికే టీడీపీ నాయకులు సిద్ధమైనట్టు జోరుగా చర్చ జరుగుతోంది.
వెనక్కి తగ్గిన జనసేన ఎమ్మెల్యే
పురుషోత్తపురంలో సుమారు రూ.25 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రం నూతన భవనం ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ టీడీపీ నేతల నిరసన విషయం తెలుసుకున్న యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ వెనక్కి తగ్గారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎమ్మెల్యే కోసం ఎదురు చూసిన వివిధ శాఖల అధికారులు, జనసేన నాయకులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆహ్వానం పంపించినా టీడీపీ నాయకులు కావాలనే నిరసన చేపట్టారని జనసేన నాయకులు ఆరోపించారు. గత సాధారణ ఎన్నికలు పూర్తయిన దగ్గర్నుంచి నియోజకవర్గంలో జనసేన,టీడీపీ నాయకుల మధ్య తరచుగా విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. అధికార కాంక్షతో రెండు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.


