బుచ్చెయ్యపేట : అర్హత ఉన్నా వితంతువులకు పింఛన్‌లు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన బల్లి సత్యవతికి 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఈమె భర్త సత్తిబాబు తాగుడుకు బానిసై ఏడాది కిందట మృతి చెందాడు. ఈమెకు 9 ఏళ్ల వయస్సు గల కుమార్తె, 7 ఏళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నారు. భర్త లేకపోయినా కూలి పనులు చేసుకుని ఇద్దరు పిల్లలను చదివించుకుంటుంది. ఈమెకు ఏడేళ్ల కిందటే భర్త పేరుపై ప్రత్యేక రేషన్ కార్డు ఉంది. భర్త చనిపోవడంతో ఇటీవల కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్‌లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లగా నీకు పింఛన్ రాదు.. అని అధికారులు తేల్చి చెప్పేశారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవక నీకు పింఛన్ ఇవ్వలేమని చెప్పడంతో ఆమె నిరాశ చెందింది. పెళ్లయి 11 ఏళ్లు దాటిన నాకు ఇద్దరు పిల్లలకు కలిసి ప్రత్యేక రేషన్ కార్డు ఉన్నా భర్త పోయి ఉన్న నాకు వితంతు పింఛన్ ఇవ్వకపోతే ఎలా అని ఆవేదన చెందుతోంది. ఇదే గ్రామానికి చెందిన కొసిరెడ్డి నూకలక్ష్మి శ్రీనివాసరావులకు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త శ్రీనివాసరావు డెంగ్యూ జ్వరంతో ఏడాది కిందట మృతి చెందాడు. ఈమెకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. నూకలక్ష్మికి, ఆమె పాపకు రేషన్ కార్డు ఉంది. కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవలేదని వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసినా మంజూరు కాదని అధికారులు తెలపడంపై ఆమె దిగులు చెందుతోంది. భర్త లేని తాను కూలి పనులు చేసుకుని కుమార్తెను పోషించుకుంటున్నానని, తనలాంటి వాళ్లకి పింఛను మంజూరు చేయకపోతే ఎలా బతకాలని ఆవేదన చెందుతోంది. అధికారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి వితంతు పింఛన్ అందేలా చేయాలని బాధితులు కోరుతున్నారు.
కొసిరెడి నూకలక్ష్మి
బల్లి సత్యవతి


