కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులు
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ శ్రీచైతన్య, నారాయణ, భాష్యం వంటి కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటు పలు ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని, విద్యాసంస్థల భవనాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ఆదివారాల్లో సైతం ఐఐటీ, నీట్ కోచింగ్ పేరుతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. నిరసనలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు మణికంఠ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


