మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 56 వినతులు అందాయి. నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, లైన్ షిఫ్టింగ్, కొత్త విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ బిల్లులు, పోల్ షిఫ్టింగ్ తదితర ఫిర్యాదులు, వినతులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. వీటిని పరిశీలించి, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912, లేదా 9493681912 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను నివేదించవచ్చన్నారు. కార్యక్రమంలో సీజీఎం పి.సోల్మన్‌రాజు, జనరల్ మేనేజర్లు ఎం.ఝాన్సీ, వీవీఎస్‌ఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


