● సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు
పాడేరు రూరల్: పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు హెచ్చరించారు. శుక్రవారం పాడేరు మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులు సీఐటీయూ నాయకులతో కలిసి అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గతంలో కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలు, ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. అక్టోబర్ 2 నుంచి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వసంత్, బాలన్న, సూరిబాబు, మోహన్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.


