కశింకోట: ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అన్నారు. స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో శుక్రవారం ‘ఎనర్జీ బాస్కెట్ –2047 అనుకూలతలు, ప్రతి కూలతలు’ అనే అంశంపై శుక్రవారం విద్యార్థులతో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. 24 మండలాల నుంచి 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులను రాష్ట్ర స్థాయి సదస్సుకు ఎంపిక చేశారు. అనకాపల్లి మండలం ఎ.కోడూరు జెడ్పీ హైస్కూలుకు చెందిన అనకాపల్లి భార్గవి, కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూలుకి చెందిన గుడాల లిప్సలను ఎంపిక చేశారు. వీరు ఈ నెల 23, 24 తేదీల్లో వియజవాడలో జరిగే సదస్సుల్లో పాల్గొంటారని జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సదస్సుల్లో పాల్గొని ప్రతిభను కనబరిచి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ప్రభుత్వం ఇటువంటి సదస్సులను నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. మండల విద్యా శాఖ అధికారులు రమణశ్రీ, సురేష్, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


