అనకాపల్లి: రహదారి ప్రమాదాలు చిన్నపాటి మానవుని తప్పిదాలు కారణంగా జరుగుతున్నాయని, రహదారులపై వాహనాలు నడిపే డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్త లు తీసుకోవాలని జిల్లా రవాణాశాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ లీలాప్రసాద్ అన్నారు. స్థానిక ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో హెవీ డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్న 15వ బ్యాచ్‌కు రోడ్డు ప్రమాదాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్‌ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఎదుట వ్యక్తి కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నారో లేదో గమనించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. రానున్న రోజుల్లో హెవీ డ్రైవింగ్‌కు ఎక్కువగా గిరాకీ ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జి.వి.రమణ, డ్రైవింగ్ స్కూల్ అసిస్టెంట్ ఎ.వి.బాపునాయుడు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జెఎం.రావు, తదితరులు పాల్గొన్నారు.


