● సీనియర్ కన్సల్టెంట్ నరసింహమూర్తి
చింతపల్లి: కౌమారదశ విద్యార్థుల ఉన్నతే ధ్యేయంగా ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని ప్రోగ్రామ్ సీనియర్ కన్సల్టెంట్ నరసింహమూర్తి అన్నారు. గురువారం స్థానిక సీ్త్ర శక్తి భవన సమావేశ మందిరంలో నోడల్ ఉపాధ్యాయుల రెండు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే కౌమారదశ విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తొలిసారిగా ఈ పైలట్ ప్రాజెక్టును అల్లూరి జిల్లాలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు విడతలుగా జరిగిన ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా, రానున్న రోజుల్లో దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులకు ఈ శిక్షణ విద్యార్థులకు బోధన చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షణా అధికారులను అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిట్టంగి ప్రసాద్, సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రోగ్రామ్ అధికారి సుబ్బారెడ్డి, పడాల చారిటబుల్ ట్రస్ట్ సీఈవో సూర్యపడాల్, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, సీడీపీవో శ్రీదేవి చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన నోడల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


