అచ్యుతాపురం రూరల్: భోగాపురం వెళ్లే మార్గంలో ఒక ఇంట్లో నివాసం ఉంటున్న బులుసు సందీప్ (37) ఆదివారం ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి సోదరుడు బులుసు స్వరూప్ తెలిపిన వివరాలివి. సందీప్ మూడు రోజుల క్రితం రాజమండ్రిలో ఉన్న తన వద్దకు వచ్చి, కోల్‌కతాలో శిక్షణకు వెళ్లాల్సి ఉందని, అందుకు రూ.45 వేలు అవసరమని చెప్పడంతో ఆ మొత్తాన్ని ఇచ్చానని తెలిపాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో సందీప్ ఉరివేసుకుని మృతి చెందినట్టు సమాచారం అందడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిపారు. సందీప్‌పై సుమారు రూ.12 లక్షలు రుణం ఉన్నప్పటికీ దాన్ని తీర్చే స్తోమత తనకు ఉందని, ఆత్మహత్య చేసుకునేంత అధైర్యవంతుడు కాదని స్వరూప్ ఆవేదన చెందారు. తామిద్దరికీ ఒకరికొకరు తప్ప మరెవరూ బంధువులు లేరని, ఏ సమస్య వచ్చినా ఇద్దరూ కలిసి పరిష్కరించుకునేవారమని తెలిపారు. అయితే సందీప్ గతంలో పనిచేసిన రుషిల్ ఇండస్ట్రీస్ యాజమానులతో కొన్ని మనస్పర్థలు ఉన్నాయన్నారు. మృతుని సోదరుడు స్వరూప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు తెలిపారు.


