సమీక్షలు లేవు..సమస్యలు తీరవు | - | Sakshi
Sakshi News home page

సమీక్షలు లేవు..సమస్యలు తీరవు

Aug 18 2026 12:27 AM | Updated on Aug 18 2026 12:27 AM

● పాడేరు ఐటీడీఏలో..
ఐటీడీఏలో 16 నెలలుగా జరగని పాలకమండలి సమావేశాలు గిరిజనుల సమస్యలు పట్టని కూటమి ప్రభుత్వం సమావేశాలను మరచిన గిరిజన మంత్రి 3 నెలలకోసారి నిర్వహించే నిబంధనలకు తూట్లు

సాక్షి, పాడేరు: గిరిజనాభివృద్ధిలో ఐటీడీఏ వ్యవస్థ కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐటీడీఏకు ఏటా రూ.వేల కోట్లలో నిధులు వస్తాయి. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారికి సింగిల్‌ లైన్‌ అడ్మినిస్ట్రేటర్‌గా విశేష అధికారాలు ఉన్నాయి. గిరిజనులకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఏ ద్వారానే జరుగుతాయి. రూ.కోట్ల నిధులను గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చుపెడతారు.

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, చేసిన పనులపై సమీక్షించేందుకు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎంపీపీలు, జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్‌, జేసీ, జెడ్పీ చైర్మన్‌, ఐటీడీఏ పీవో, సబ్‌కలెక్టర్‌తో పాలకవర్గ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలి. ఐటీడీఏకు కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించాలి. ఇంత కీలకమైన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల నిర్వహణపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

గిరిజన మంత్రికి తీరిక లేదా?

ఏడాదిలో నాలుగు సార్లు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ 16 నెలల వ్యవధిలో పాడేరులో అనేకసార్లు పర్యటించినప్పటికీ ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహణకు తీరికలేకుండా పోయింది. దీంతో ఐటీడీఏ పరిధిలో ఏయే పనులు జరుగుతున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు అనే అంశాలపై పారదర్శకత లేకుండా పోయిందని స్థానిక ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు.

జిల్లాలో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యపరంగా అనేక సమస్యలు నెలకొన్నాయి. తాగునీరు లేక పలు గ్రామాల్లో గిరిజనుల గొంతెండుతోంది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ని 11 మండలాలతో పాటు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజవర్గాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఏ ద్వారా జరగాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు ఉపా ధి, రోడ్లు, రవాణా, కాఫీ తోటల విస్తరణ, మిరియాల సాగు తదితర 63 విభాగాల పనులను ఐటీడీఏ పర్యవేక్షిస్తుంది. పాలకవర్గం సమావేశం జరగకపోవడంతో ఈకార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు తెలియడం లేదు.

టీడీఏ పాలకవర్గంలో మంత్రి సంధ్యారాణి మినహా, మిగిలిన ప్రజాప్రతినిధులంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో పాటు తొమ్మిది మంది ఎంపీపీలు, తొమ్మిది మంది జెడ్పీ టీసీలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారు కాగా, అనంతగిరి జెడ్పీటీసీ సీపీఎంలో ఉన్నారు. వారంతా గిరిజన సమస్యలు, సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల జీవోపై నిలదీస్తారనే భయంతోనే కూటమి ప్రభుత్వం 16 నెలలుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపక్షాలు నిలదీస్తాయనే...

వెంటాడుతున్న సమస్యలు

ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలపై నిర్లక్ష్యం

గిరిజన సంక్షేమానికి కీలకమైన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఐటీడీఏలో చర్చించాల్సిన గిరిజన సమస్యలను తాను జిల్లా పరిషత్‌ సమావేశాల దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. గిరిజనుల సమస్యలతో పాటు నిధుల కేటాయింపులు, ఖర్చుల వివరాలను ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో చర్చించే వీలులేకుండా పోవడం బాధాకరం.

–జల్లిపల్లి సుభద్ర, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement