పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం

Aug 18 2026 12:27 AM | Updated on Aug 18 2026 12:27 AM

పాడేరు: క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో నిరంతరం శ్రమిస్తే పోటీ పరీక్షల్లో విజయం తథ్యమని కలెక్టర్‌ నిశాంతి తెలిపారు. డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు పట్టణ శివారు కుమ్మరిపుట్టు శంకరన్‌ ఆడిటోరియంలో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీఎస్సీకి సిద్ధమయ్యే ప్రతి అభ్యర్థి అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న పూర్తి సిలబస్‌పై సమగ్రంగా అవగాహన చేసుకోవాలన్నారు. సిలబస్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని టైం టేబుల్‌ ప్రకారం చదువుకోవాలన్నారు. మాక్‌ టెస్టులు, గత ప్రశ్న పత్రాల పరిశీలన తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని 11 మండలాల్లోని గ్రంథాలయాల్లో డీఎస్సీ అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం డీఎస్సీకే పరిమితం కాకుండా ఏపీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌, అగ్నివీర్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధం కాలన్నారు. ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు, జాబ్‌మేళాలు, ప్రభుత్వ సబ్సిడీలు ఉన్న స్టార్టప్‌లు, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గతంలో డీఎస్సీలో విజయం సాధించి, ఉపాధ్యాయులుగా ఎంపికై న పలువురితో అవగాహన కల్పించారు. సదస్సుకు హాజరైన అభ్యర్థులకు ఉచితంగా నోట్‌ప్యాడ్‌లు, స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ శాఖ అధికారి ఎం.వి.ఎస్‌ లోకేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌. భానుమూర్తి, టీడబ్ల్యూ డీడీ పరిమళ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, గురుకులం ఓఎస్డీ మూర్తి, డీపీఆర్వో అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ అభ్యర్థుల అవగాహన సదస్సులో కలెక్టర్‌ నిశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement