నక్కపల్లి: మండలంలో గ్రావల్ మాఫియానుంచి కొండలను కాపాడాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్ విజయ్‌కృష్ణన్‌ను కోరారు. బుధవారం నక్కపల్లి మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ వేంపాడులో పాలకొండను కొల్లగొట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు నక్కపల్లితో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అనధికార లేఅవుట్లకు ఈ గ్రావల్ తవ్వి తరలించేందుకు సిద్దపడుతున్నారన్నారు. పాలకొండను మరో పంచదార్ల కొండలా చేయొద్దని కోరారు. ఉద్దండపురం, బోదిగల్లంలో ఉన్న కొండలను కూడా కొల్లగొడుతున్నారన్నారు. నిత్యం వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావల్‌ను ట్రిప్పర్లలో తరలించుకుపోతున్నారని, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. తునికి చెందిన ఒక టీడీపీ నాయకుడికి వేంపాడు పాలకొండలో గ్రావల్ తవ్వి లేఅవుట్‌లోకి తరలించేందుకు ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇప్పటికే కమీషన్ల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. పాలకొండలో గ్రావల్ తవ్వకాలకు అనుమతిస్తే వైఎస్సార్‌సీసీ ఉమ్మడి విశాఖ జిల్లా నేతలంతా కలిసి ఉద్యమ బాటపట్టాల్సి వస్తుందన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఉన్న కొండల్లో గ్రావల్‌ను కూడా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తవ్వి తరలిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీఽ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, తళ్ల భార్గవ్ పాల్గొన్నారు.
సాగునీటి వనరులు స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించొద్దు
మండలంలో కాగితలో చెరువులు, గెడ్డలు, వాగులను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించొద్దని గ్రామానికి చెదందిన పలువురు రైతులు కలెక్టర్‌ను కోరారు. వైఎస్సార్‌సిపి నేత వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు బుధవారం కలెక్టర్ విజయ్‌కృష్ణను కలిసారు. గ్రామంలో సుమారు 17 ఎకరాల వీస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, గొల్ల చెరువు, గెడ్డలను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ చెరువుల కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ప్రధాన సాగునీటి వనరులను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తే ఆయకట్టు భూములపై ఆధారపడ్డ వందలాది మంది రైతులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములు సాగునీరు అందక బీడు వారతాయన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతులు దేవవరపు శివ,పోతంశెట్టి బాబ్జి, గుమ్మిళ్ల గోవిందరావు,పోతంశెట్టి వీరబాబు, దేవవరపు గోవిందరావు,పోతంశెట్టి గణేష్, సకుర్తి సత్తిబాబు,గంగేశ్వరరావు ఉన్నారు.
కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ నేతల వినతి


