చీడికాడ: పాముకాటుకు గురైన వివాహిత విశాఖ కేజిహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు మండలంలోని వరాహపురం తాజామాజీ సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలిబోయిన ఘాఠీలు(29)ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటి బయట ఉన్న సమయంలో విష సర్పం కాటు వేసింది. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న భర్త అర్జునకు ఘాఠీలు చెప్పడంతో హుటాహుటినా చోడవరం సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడ నుంచి విశాఖ కేజిహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం ఘాఠీలు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందిదన్నారు. ఘాఠీలకు పార్ధు(12),షణ్ముకం(9),దీక్షిత(6) వయస్సు గల ముగ్గురు పిల్లలున్నారు. భర్త అర్జున ఫిర్యాదు మేరకు చీడికాడ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన ఘాఠీలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


