కశింకోట ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ సిబ్బంది రిలేదీక్షలు | - | Sakshi
Sakshi News home page

కశింకోట ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ సిబ్బంది రిలేదీక్షలు

Aug 11 2026 1:06 AM | Updated on Aug 11 2026 1:06 AM

కశింకోట : కశింకోటలోని ఆర్‌ఈసీఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపక సిబ్బంది తమకు జీతాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టి నిర్వహించారు. ముందుగా కళాశాల ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది నిరాహార దీక్షలు చేపట్టారు. కుదించిన జీతాలను పునరుద్ధరించాలని, వేతన సవరణ ప్రకారం జీతాలు ఇవ్వాలని, రాజీనామా చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షలు కొనసాగిస్తుండగా మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్‌ బి.ఉమాశంకర్‌, అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ శివ, అధ్యాపక సిబ్బంది యూనియన్‌ ప్రతినిధులతో ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు పిలిచి ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీఈపీడీసీఎల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వనజ, సీఈవో రామకృష్ణ, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సాల్మాన్‌రాజు, విజిలెన్స్‌ ఎస్పీ కింజరపు శ్రీనివాసరావు, ఎపీఈపీడీసీఎల్‌ అనకాపల్లి సూపరింటిండెంటింగ్‌ ఇంజనీర్‌, ఆర్‌ఈసీఎస్‌ ఎండీ కూడా అయిన జి.ప్రసాద్‌ తదితరులు పాల్గొని చర్చించిన అనంతరం ఈ నెల 20లోగా సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. అలాగే రెండు మూడు రోజుల్లో ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీని కలిసే ఏర్పాట్లు కూడా చేస్తామని, దీక్షలు విరమించాలని కోరారు. దీంతో దీక్షలను తాత్కాలికంగా వరమిస్తున్నట్టు కళాశాల ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. యూనియన్‌ అధ్యక్షుడు హేమంత్‌, కార్యదర్శి నగేష్‌, అధ్యాపక సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement