కశింకోట: అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేసి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్ అదనపు డైరెక్టర్ టి చైతన్య కల్యాణ జయ భరత్‌రాజ్ ఆదేశించారు. మండలలోని స్వర్ణ గ్రామ పంచాయతీగా ఎంపికై న జి.భీమవరం గ్రామాన్ని సోమవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పాలనా పరమైన చర్యలు చేపట్టి కొనసాగించాలన్నారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, ఇతర సేవలను మెరుగుపర్చడం, అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలు, ప్రభుత్వ పథకాల అమలుపై పారదర్శకత ఉండాలన్నారు. స్వర్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. గ్రామాన్ని జాతీయ పురస్కారం పొందడం కోసం పలు సూచనలు చేశారు. ఎంపీడీవో చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


