మాడుగుల రూరల్: కె.జె.పురం మోదమాంబ అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఘాటాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించారు. సాయంత్రం నుంచి నేల వేషాలు, శక్తి వేషాలు, తీనుమార్, తప్పెటగుళ్లు, జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రికి గ్రామంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దాతల సహకారంతో పులిహోర, మజ్జిగ, ప్రూటు సలాడు, స్వీటు భక్తులకు అందజేశారు. అరుణా కేటరింగ్ వారి ఆర్థిక సహకారంతో భక్తులకు, చిరు వ్యాపారులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఉత్సాహంగా ఎడ్ల పరుగు పోటీలు
జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. పోటీలను మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జాతరలో ఆకర్షణీయంగా ఆడారి కుటుంబీకులు అయిన ఆడారి కామునాయుడు కుటుంబ సభ్యులు ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఏలిఏనుగు మీద ఎక్కి గ్రామంలో తిరిగారు.


