డ్రోన్లతో మారుమూల ప్రాంతాల్లో విత్తన బంతుల వెదజల్లింపు
అడవుల విస్తరణకు అటవీశాఖ వినూత్న ప్రణాళిక
కొండలు, చేరుకోలేని ప్రాంతాల్లోనూ పచ్చదనం కోసం ప్రయత్నం
గ్రామసభల ద్వారా గిరిజనులకు విత్తన బంతుల పంపిణీ
సీలేరు: ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ అడవులు ప్రకృతికి పెట్టింది పేరుగా ఉండేవి. విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, వృక్ష, జంతు సంపదకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేది. కాలక్రమేణా పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి కారణాలతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది.
● అడవుల నరికివేతతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అటవీశాఖ అడవుల పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.
విత్తన బంతులతో పచ్చదనం
జిల్లాలోని ఏజెన్సీలో అటవీ విస్తరణను పెంచేందుకు ఈ ఏడాది విత్తన బంతుల కార్యక్రమాన్ని చేపట్టారు. పాడేరు, చింతపల్లి అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్‌లలో విత్తన బంతులను తయారు చేసి అడవుల్లో నాటే కార్యక్రమం చేపట్టారు.
● సాంప్రదాయ పద్ధతిలో గోతులు తీసి మొక్కలు నాటడంతో పాటు.. మారుమూల, కొండ ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల డ్రోన్ల ద్వారా విత్తన బంతులను అడవుల్లో వెదజల్లారు. ప్రతి హెక్టారులో నిర్ణీత సంఖ్యలో విత్తన బంతులు నాటేలా చర్యలు చేపట్టారు.
గ్రామ సభలతో అవగాహన
● డ్రోన్ల ద్వారా విత్తన బంతులు వెదజల్లడంతో పాటు.. అటవీశాఖ సిబ్బంది గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అడవుల నరికివేత, వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులు, గిరిజనులకు విత్తన బంతులను అందజేసి వారి భూముల్లో వాటిని నాటించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు.
● చింత, రావి, నేరేడు, తురకవేప, మామిడి, నల్లమద్ది తదితర మొక్కలకు సంబంధించిన విత్తనాలను విత్తన బంతుల రూపంలో తయారు చేసి నాటుతున్నారు.
అటవీ అభివృద్ధికి కృషి
ఏజెన్సీలో అడవులు అంతరించిపోతున్న తరుణంలో.. అటవీశాఖ చేపట్టిన విత్తన బంతుల కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులు, గిరిజనులు సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటి అటవీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపడతాం. గిరిజనులు ఎవరూ చెట్లు నరకవద్దని, అడవులను కాపాడుకోవాలని కోరుతున్నాం. అడవులను కాపాడితేనే మానవాళికి ఎదురయ్యే ముప్పును తగ్గించగలుగుతాం.
– వైవీ నర్సింగరావు, డీఎఫ్‌వో, చింతపల్లి


