అగనంపూడి: ఉపాధి కల్పిస్తామనే హామీతో రీఫ్రాక్టరీస్ సంస్థ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని లేదా తగిన నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రీఫ్రాక్టరీస్ భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సంస్థకు చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అగనంపూడి జాతీయ రహదారి జంక్షన్‌లో నిరసన చేపట్టారు. అనంతరం నిర్వాసితులు జాతీయ రహదారి కూడలి నుంచి బొర్రమాంబ వనం మీదుగా రీఫ్రాక్టరీస్ సంస్థ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు గవర నరసింగరావు, పెదిరెడ్ల హరనాథ్ మాట్లాడుతూ.. రీఫ్రాక్టరీస్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించకముందే మూతపడిందన్నారు. సంస్థ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న యాజమాన్యం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు ఐటీ హబ్ పేరుతో మరోసారి నిర్వాసితులకు అన్యాయం చేయొద్దని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు లక్కరాజు గోవిందరాజులు, కొలపర్తి శ్రీనివాసరావు, పెదిరెడ్ల నీలకంఠం, చిత్తా అబ్బాయి, న్యాయవాది ప్రభాకరరావు, మంచాల కన్నారావు పాల్గొన్నారు.


