ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ | - | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

పద్మనాభం సంతాప సభలో బొత్స,కన్నబాబు, అమర్‌నాథ్‌

పాల్గొన్న కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు తోట రాజీవ్‌, ఉత్తరాంధ్ర కాపు నేతలు

సాక్షి, విశాఖపట్నం: దివంగత మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు జాతి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, ఆయన ఆశయం, ఆలోచన, స్ఫూర్తితో కాపులంతా ఒక్కటై అదే బాటలో పోరాటం సాగించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో సిరిపురం జంక్షన్‌లోని వీఎంఆర్‌డీఏ ఎరేనాలో ‘విశాఖ కాపునాడు’ ఆధ్వర్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాపునాడు నాయకుడు తోట రాజీవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీలకతీతంగా కాపు నాయకులు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. కాపు జాతికి ముద్రగడ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సభ ప్రారంభానికి ముందు ముద్రగడ చిత్రపటానికి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తోట రాజీవ్‌, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ హర్షకుమార్‌, కాపునాడు జేఏసీ నాయకులు సాయిసుధాకర్‌ నాయుడు, చందు జనార్దన్‌, ఆకుల రామకృష్ణ, ఏసుదాస్‌, ఆరేటి ప్రకాష్‌, తోట రామకృష్ణ, అడ్వకేట్‌ బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇది కేవలం ముద్రగడ సంతాప సభ మాత్రమే కాదని, కాపు జాతికి ఒక సందేశ సభ అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు నాటి ప్రభుత్వం జీవో నంబరు30 ఇచ్చినప్పటికీ, అది ఆచరణలో పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేదన్నారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా వేర్వేరు పార్టీల్లో పనిచేస్తున్నప్పటికీ, ఏ ఒక్కరూ తమ సొంత జాతికి నష్టం చేకూర్చేలా వ్యవహరించకూడదని కోరారు. ‘‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా తమ పార్టీ నాయకులు సొంత సామాజిక వర్గ కార్యక్రమాలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించలేదు. కానీ చంద్రబాబు మాత్రం తన పార్టీలోని కాపు నాయకులు ముద్రగడ సంతాప సభకు వెళ్లకూడదని ఆదేశించడం ఆయన శైలికి, రాజకీయ పరిపక్వతకు తగదు’’ అని విమర్శించారు.

సవాల్‌కు కట్టుబడిన నిబద్ధత:కురసాల కన్నబాబు

మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎందరో నాయకులను చూశామని, కానీ కాపు జాతి కోసం ముద్రగడ వేసిన ముద్ర చెరగనిదని కొనియాడారు. చాలామంది రాజకీయ నాయకులు తమ సామాజిక వర్గాల ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, కానీ ముద్రగడ మాత్రం జాతి ప్రయోజనాల కోసం పదవులను, రాజకీయాలను సైతం త్యాగం చేశారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో విసిరిన సవాల్‌కు కట్టుబడి, అధికారిక గెజిట్‌లో కూడా తన పేరు మార్చుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని గుర్తుచేశారు. కాపు యువత, మేధావులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు కృషి చేయాలే తప్ప, అనవసర ట్రోలింగ్‌లతో నష్టం కలిగించవద్దని హితవు పలికారు.

ఆస్తులను కరిగించుకున్న త్యాగశీలి:

గుడివాడ అమర్‌నాథ్‌

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంతో తమ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉందని తెలిపారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తుది శ్వాస వరకు ఆయన ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక బాధ్యతలు నిర్వర్తించినా తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదన్నారు. రాజకీయ అధిష్టానాలు చెప్పినట్లు నడుచుకుని ఉంటే ఆయన ఉన్నత పదవుల్లో కొనసాగేవారని, కానీ జాతి కోసం పోరాడి వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయారని గుర్తుచేశారు.

ఆత్మగౌరవానికి వేసే ముద్రే ముద్రగడ:

కాపు రాష్ట్ర జేఏసీ నాయకుడు తోట రాజీవ్‌

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనకు చిరకాల మిత్రుడని, ఆయన మన మధ్య లేరనే వార్త కాపు జాతి అభ్యున్నతకే అడ్డుపడినట్లేనన్నారు. కాపు జాతి కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలకతీతంగా ఈ సంతాప సభకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రావడం చాలా సంతోషకరమన్నారు.

అందరినీ ఆదరించిన గొప్ప మనసు:

గొల్ల బాబూరావు

రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పటి నుంచే ముద్రగడతో పరిచయం ఉందని, తనను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది ఆయనేనని తెలిపారు.

సొంత ఆస్తిని ప్రజలకు పంచిన నేత:

తోట త్రిమూర్తులు

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ముద్రగడ వందలాది ఎకరాల ఆస్తి ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆర్థికంగా ఎదగలేదని, పైగా సొంత ఆస్తులనే ప్రజల కోసం ఖర్చు చేశారని కొనియాడారు. 1994లో కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన చేసిన ఉద్యమం చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, కాపు నేతలు జియ్యాని శ్రీధర్‌, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్‌గాంధీ, పీలా ఉమారాణి, గూటూరు నరసింహమూర్తి, పీవీ సురేష్‌, కోరాడ రాజుబాబు, కోడిగుడ్ల ఫూర్ణిమ శ్రీధర్‌, మారుతి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement