● గిరిజన ఉద్యోగుల సంఘం హెచ్చరిక
● చింతపల్లిలో ఘనంగా
ఆదివాసీ దినోత్సవం
చింతపల్లి: ఆదివాసీ ప్రాంతంలో అడవి బిడ్డల హక్కులకు భంగం కలిగిస్తే ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తామని జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, గంగరాజు, యువిగిరి, వెంకటరమణ హెచ్చరించారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయ ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు కిట్లంగి ప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో గిరిజన హక్కులకు భంగం కలిగిస్తే గిరిజనుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మన్యంలో జీవో నంబర్ 3, భూబదలాయింపు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. ఈ ప్రాంతంలోని బాకై ్సట్, లేటరైట్‌తో పాటు హైడ్రోపవర్ ప్రాజెక్టుల పేరిట దొడ్డిదారిన విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గిరిజన హక్కుల జోలికి వస్తే ఉద్యమాలు జరిగే పరిస్థితులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కళ్లారా చూసిందన్నారు. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవోను పునరుద్ధరించకుంటే కూటమి ప్రభుత్వానికి గిరిజన నిరుద్యోగుల సత్తా చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, జీకే మండల అధ్యక్షులు కంకిపాటి గిరిప్రసాద్, ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు బౌడు గంగరాజు, దేపూరి శశికుమార్, గెమ్మిలి మో హన్, కుడుములు వెంకటరమణ, చింతర్ల సతీష్, మాజీ ఎంపీపీ కవడం మచ్చమ్మ, మాజీ సర్పంచ్ వీరన్నపడాల్, డీఎల్‌ఓ ప్రతినిధులు కాసులమ్మ, వెంకయమ్మ తదితరులు పాల్గొన్నారు.


