● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర హెచ్చరిక ● మన్యం బంద్‌కు విశేష స్పందన ● స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అన్నివర్గాల ప్రజలు | - | Sakshi
Sakshi News home page

● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర హెచ్చరిక ● మన్యం బంద్‌కు విశేష స్పందన ● స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అన్నివర్గాల ప్రజలు

Aug 9 2026 12:23 AM | Updated on Aug 9 2026 12:23 AM

● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర హెచ్చరిక ● మన్యం బంద్‌కు విశేష స్పందన ● స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అన్నివర్గాల ప్రజలు

ముంచంగిపుట్టు: గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర హెచ్చరించారు. గిరిజన ప్రజా సంఘాల పిలుపు మేరకు శనివారం ముంచంగిపుట్టులో నిర్వహించిన మన్యం బంద్‌లో ఆమె పాల్గొన్నారు. ఉదయం నుంచే గిరిజన ప్రజా సంఘాల నేతలు బంద్‌లో పాల్గొనగా.. వర్తక సంఘాలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి మద్దతు తెలిపాయి. వారపు సంత రద్దయింది. ప్రైవేట్‌ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుజభంగి, కిలగాడ, డేగలపుట్టు, ఆసరాడ, పోలీపుట్టు జంక్షన్ల వద్ద గిరిజనులు నిరసనలు చేపట్టారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి గిరిజన హక్కులు, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అరకు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో నంబర్‌3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకువచ్చి గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం గిరిజనులను మోసం చేయడమేనని విమర్శించారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గిరిజనేతరులు గిరిజన చట్టాల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. గిరిజన యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టాన్ని తొలగించాలని 1,670 మంది గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే జీవో నంబర్‌3 అమలు చేసి గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ నాని ఆధ్వర్యంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సత్యనారాయణతో పాటు గిరిజన ప్రజా సంఘాలు, గిరిజన ఉద్యోగుల సంఘాల నేతలు, ఎంఎంశ్రీను,కె.త్రినాధ్‌,పి.పద్మారావు, ఎ.జగబంధు, నర్సయ్య, నీలకంఠం, అనిల్‌కుమార్‌, కొండలరావు, కొండపడాల్‌, బాబురావు,అధిక సంఖ్యల్లో గిరిజనులు పాల్గొన్నారు.

మూతపడిన పర్యాటక ప్రాంతాలు

డుంబ్రిగుడ: మన్యం వ్యాప్తంగా శనివారం నిర్వహించిన బంద్‌ ప్రభావం పర్యాటక రంగంపైనా పడింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన చాపరాయి జలపాతం, అరకు పరిసరాల్లోని పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో వీకెండ్‌ ఎంజాయ్‌ చేసేందుకు మైదాన ప్రాంతాలతో పాటు ఒడిశా, తెలంగాణ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మన్యానికి వస్తుంటారు. అయితే ముందస్తుగా బంద్‌కు పిలుపునివ్వడంతో కొంతమంది పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరికొందరు పర్యాటకులు జాతీయ రహదారి మీదుగా మన్యానికి చేరుకున్నప్పటికీ.. బంద్‌ కారణంగా పర్యాటక కేంద్రాలతో పాటు హోటళ్లు కూడా మూతపడటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కొయ్యూరులో రహదారిపై బైఠాయింపు

కొయ్యూరు: 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతంలోని ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ సంఘాలు చేపట్టిన బంద్‌ శనివారం విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. ఉదయం రెండు బస్సులు తిరిగిన అనంతరం వాటిని నిలిపివేశారు. రాజేంద్రపాలెంలో బంద్‌ పటిష్టంగా నిర్వహించారు. మర్రిపాలెం జంక్షన్‌లో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు బిడిజన అప్పారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపివేయడంతో చింతపల్లి–నర్సీపట్నం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీపీఎం నేత ఎస్‌. సూరిబాబు, వైఎస్సార్‌ సీపీ మండల ఉపాధ్యక్షుడు నర్సి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పెదబయలు: మన్యం బంద్‌ మండలంలో సంపూర్ణంగా జరిగింది. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ నిర్వహించారు. మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూతపడ్డాయి. పెదబయలు అంబేడ్కర్‌ కూడలిలో గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపై నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీలేరు: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిర్వహించిన బంద్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పాక్షికంగా జరిగింది. దారకొండలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. గిరిజన సంఘాల నాయకులు ముందుగా దుకాణాలను మూసివేయించి.. అనంతరం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ యాసిన్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

జి.మాడుగుల: మన్యం బంద్‌ మండలంలో సంపూర్ణంగా జరిగింది.జి.మాడుగుల–పాడేరు–చింతపల్లి ప్రధాన రహదారిలోని మూడు రోడ్ల జీపుల స్టాండ్‌ వద్ద ఆందోళనకారులు వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. జి.మాడుగుల, బంధవీధి, సంతబయలు, నిట్టాపుట్టు తదితర గ్రామాల్లో దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిరసనకారులు జీవో3పై చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించాలి.. అంటూ నినాదాలు చేశారు. ఆదివాసీ యువత కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో స్థానిక ఎస్‌ఐ సాయిరాంపడాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహన రాకపోకలను పునరుద్ధరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, తాజా మాజీ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సురభంగి రామకృష్ణ, మాజీ సర్పంచ్‌ ఐసరం హనుమంతరావు, కిముడు రాంబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సిర్మా పండన్న, జీఓ–3 సాధన కమిటీ జిల్లా కార్యదర్శి మత్స్యరాస నారాయణరాజు, ఉపాధ్యక్షుడు కోటిబాబు, పెసా కమిటీ మండల అధ్యక్షుడు లకె రామకృష్ణ, ఉపాధ్యక్షుడు కిముడు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మన్యం బంద్‌ సంపూర్ణం

చింతపల్లి: మన్యంలో జీవో నంబర్‌–3కు ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకురావడంతో పాటు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్థానిక ఎంపీపీ కోరాబు అనూషదేవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌ హెచ్చరించారు. ప్రజా సంఘాల పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ మద్దతుతో శనివారం నిర్వహించిన మన్యం బంద్‌ చింతపల్లిలో ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సీపీఐ, సీపీఎం నాయకులు మండలంలోని పలు కూడళ్ల వద్ద బంద్‌ నిర్వహించారు. మండల కేంద్రంలో హనుమాన్‌ జంక్షన్‌ నుంచి సంత మార్కెట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్‌ వద్ద మానవహారంగా ఏర్పడి సమావేశం నిర్వహించారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనూషదేవి, జల్లి సుధాకర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు జీఓ–3కు ప్రత్యామ్నాయ జీఓ తీసుకువచ్చి గిరిజన నిరుద్యోగ యువతకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను కాపాడుతూ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఏజెన్సీలోని ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ఆలోచనలను విరమించుకోవాలని, బాకై ్సట్‌, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈకార్యక్రమంలో గూడెంకొత్తవీధి ఎంపీపీ బోయిన కుమారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్‌, సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు ధనంజయ్‌, పెట్ల పోతురాజు, డీఎల్వో ప్రతినిధులు వెంకయ్యమ్మ తదితరులు ప్రసంగించారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, పంచాయతీరాజ్‌ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సాగిన గంగన్నపడాల్‌, జీకేవీధి మండల పార్టీ అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు కరుణానిధి, బేరా రమణ, చింతర్ల రాంకీ పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: మండలంలో బంద్‌ విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన బంద్‌కు వ్యాపారులు మద్దతు తెలిపారు. మండల కేంద్రంలోని కిరాణా దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌ను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బంద్‌లో జాతీయ రహదారిపై మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాలు, భూముల జోలికొస్తే ఖబడ్దార్‌’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మూడు రోడ్ల జంక్షన్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన్యంలో హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి జారీ చేసిన జీఓలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్‌, వైస్‌ ఎంపీపీ శెట్టి ఆనందరావు, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పోతురాజు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు పి. సురేష్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ గుమ్మ నాగేశ్వరరావు, కె.హరి, ఎంపీటీసీ రామారావు, మండల వైఎస్సార్‌సీపీ కార్యదర్శి మఠం శంకర్‌రావు, బాకా సింహాచలం, జి. చిరంజీవి, విజయదశమి, పి. సత్యనారాయణ పాల్గొన్నారు.

హుకుంపేట: మండల కేంద్రంతో పాటు ప్రధాన ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శనివారం ప్రశాంతంగా బంద్‌ నిర్వహించారు. మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్‌, రేగం రమేష్‌, సమిడ వెంకటపూర్ణిమ, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

గూడెంకొత్తవీధి: గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణలో భాగంగా శనివారం నిర్వహించిన అరణ్య గిరిజన బంద్‌ మండల కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ, గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర మన్యం బంద్‌లో నాయకులు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పలుచోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వంతల అరుణ్‌, ఎంపీటీసీ బుజ్జిబాబు, నారాయణ, ఎల్లారావు, రామారావు, బలరాం పాల్గొన్నారు.

గిరిజన హక్కుల జోలికొస్తే..

ప్రజా ఉద్యమం తప్పదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement