చింతపల్లి: బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ సుబ్బారావు అన్నారు. శనివారం మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధి మేడూరు, రామారావుపాలెం గ్రామాల్లో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. బాల్య వివాహాల కారణంగా బాలికలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామాల్లో బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాంబాబు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


