● పెద్దపెద్ద గోతులతో దర్శనం
● ప్రమాదకరంగా ప్రయాణాలు
● బెంబేలెత్తిపోతున్న వాహనదారులు
● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
చోడవరం: రోడ్డును బాగుచేయండి మహాప్రభో అంటూ ప్రజలంతా వేడుకుంటున్నా... చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో అన్న ప్రధాన నగరాలతోపాటు మూడు జిల్లాలను అనుసంధానం చేస్తున్న భీమిలి–నర్సీపట్నం రోడ్డు దుస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు చోడవరం నియోజకర్గంలో ప్రధాన మెయిన్‌రోడ్డుగా ఉండటంతో 53 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద గోతులతో రోడ్డంతా చాలా ప్రమాదకరంగా మారింది. దీనిపై ఇప్పటికే రోడ్డు పొడవునా అనేక సార్లు ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
న్యాయవాదులు రోడ్డెక్కినా...
ఈ రోడ్డును బాగుచేయకపోవడంతో చివరికి న్యాయవాదులు, ఆర్క్ సంస్థ ప్రతినిధులు కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి, సదరు రోడ్డు టెండరు తీసుకున్న సీఎస్‌ఆర్ కనస్ట్రక్షన్‌కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఆర్‌అండ్‌బి అధికారులైతే ప్రజలకు, కోర్టుకి ఏవో కుంటి షాకులు చెబుతూ ఎందుకూ పనికిరాని శాఖగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట, రోలుగుంట మీదుగా మెయిన్‌రోడ్డు(బీఎన్‌రోడ్డు) పెద్దపెద్ద గోతులు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. 20 యేళ్లుగా ఈ రోడ్డును పూర్తి స్థాయిలో వేయకుండా వదిలేశారు. దీనితో ఇప్పుడు పూర్తిగా దెబ్బతిని చాలా పెద్దపెద్ద గోతులతో వాహనానలు రాకపోకలు సాగించడానికి వీలులేకుండా చాలా ప్రమాదకరంగా అధ్వానంగా తయారైంది. అదేవిధంగా అనకాపల్లి నుంచి వెంకన్నపాలెం ఆర్‌అండ్‌బీ రోడ్డు కూడా చాలా మేర పూర్తి దెబ్బతిని గోతులతో నిండిపోయింది. ప్రభుత్వం ఈ రెండు రోడ్లుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో నిత్యం ఈ గోతుల్లో పడి అనేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.
ప్రధాన వంతెనలు కూలడంతో నిలిచిన రాకపోకలు
ఇప్పటికే వడ్డాది, విజయరామరాజుపేట వద్ద ఈ రోడ్డుపై రెండు ప్రధాన వంతెనలు కూలిపోవడం, వాటికి వేసిన అప్రోచ్ రోడ్లు సైతం గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. ఇంతకాలంగా రోడ్డు బాగోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ప్రజలంతా తమ ప్రయాణాలను సైతం మానుకొని ఇళ్లలో కూర్చొవలసని పరిస్థితి ఏర్పండింది. మరీ అత్యవసర ప్రయాణాలు, ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే తప్పనసరి పరిస్థితుల్లో ఈరోడ్లలో ప్రయాణం చేస్తున్నారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్లే రోగులు మధ్యలోనే ఇబ్బందులు, ప్రాణాలు కోల్పోయే అత్యంత దయనీయ స్థితిలో ఈ రోడ్లు ఉన్నాయి. పాడేరు ఏజెన్సీకి, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి వంటి పట్టణాలకు ఇదే ప్రధాన రహదారి. రోజూ వందలాది వాహనాలు రాకపోలకు సాగిస్తుంటాయి. ఇంతటి రద్దీ రోడ్డు పెద్దపెద్ద గోతులతో పూర్తిగా శిథిలమైపోయి ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్త ంచేస్తున్నారు. ఈ రోడ్డు బాగోలేదంటూ అనేక సార్లు మీడియా, పత్రికల్లో వచ్చినా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో వర్షాలకు ఈ రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద గోతుల్లో వర్షం నీరుచేరి చెరువులను తలపిస్తున్నాయి. ఏ గోతులో పడి ఏ వాహనం ప్రమాదానికి గురవుతుందోనని భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.


