దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి శివారు బండారు వీధిలో ఈ నెల 4న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు యువకులు, ఒక బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాపల్లిలోని బంగారమ్మపాలెం వెళ్లే రహదారిలో ఉన్న చొక్కాకుల దేముడమ్మ ఇంటిలో ఈ నెల 4న చోరీ జరిగింది. వీరి ఇల్లు శివారున ఉండటంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిలో ఎవరూ ఉండరని గుర్తించిన అదే గ్రామానికి చెందిన నిందితులు వేమల తరుణ్, బండారు దేముడునాయుడుతో పాటు మరో బాలుడు నెల రోజుల నుంచి చోరీకి పక్కా ప్లాన్ వేశారు. ఇంటి వెనుక బాత్‌రూమ్ గోడపై నుంచి మేడపైకి ఎక్కి మెట్ల ద్వారా ఇంటిలోకి ప్రవేశించారు. ఇనుప రాడ్డుతో బెడ్ రూమ్‌లోని బీరువాను పగలగొట్టి రెండు పుస్తెలతో కూడిన బంగారు మంగళసూత్రం తదితర మూడు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు అపహరించారు. చోరీ చేసిన బంగారం, వెండి వస్తువులను కాలేజీ వెనుక భాగంలోని ఆయిల్‌పామ్ తోటలో పాతి పెట్టారు. నగదును ముగ్గురూ సమానంగా పంచుకున్నారు. ఈ ముగ్గురిని కాశీపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తమ విచారణలో నేరం అంగీకరించడంతో వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్‌ఐ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కె.కోటపాడు సీఐ కె.కృష్ణ నేతృత్వంలో పోలీసులు 36 గంటల వ్యవధిలోనే చోరీ కేసును ఛేదించారు.
బంగారం, వెండి, నగదు స్వాధీనం


