జి.మాడుగుల: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు అవసరం) అనే నినాదంతో ఈనెల 15 వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిగి సత్యనారాయణ తెలిపారు. జి.మాడుగులలో సీపీఐ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ – మార్పు అవసరం ర్యాలీ పోస్టర్లను శుక్రవారం కార్మిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న ధరలను తక్షణమే నియంత్రించాలని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సార్వత్రిక విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేలా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా ప్రతి యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళలకు పార్లమెంట్, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు ప్రజలందరూ పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏఎస్సార్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంతాల పండుబాబు, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు ప్రసాద్, సత్తిబాబు, బాబూరావు, జి. శ్రీనుబాబు, వి. శంకర్, కె. శ్రీను, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.


