కొయ్యూరు: కలెక్టర్ ఆదేశాలతో డీఈవో భానుమూర్తిరాజు హామీ మేరకు శుక్రవారం సాయంత్రం గింజర్తి గ్రామస్తులు, విద్యార్థులు దీక్షలను విరమించారు. సోమవారం నాటికి 3, 4, 5 తరగతులను గింజర్తిలోనే కొనసాగించే విధంగా రాతపూర్వక ఆదేశాలు రాకుంటే తిరిగి దీక్షలు ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు. గింజర్తిలోనే పై తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, విద్యార్థులు వారం రోజులుగా ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిశాంతి గురువారం రాత్రి 3, 4, 5 తరగతులను గింజర్తిలోనే యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించినట్లు గ్రామస్తులకు తెలిపారు. అయితే దీనిపై రాతపూర్వక ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం కూడా దీక్ష కొనసాగించారు. దీంతో డీఈవో భానుమూర్తిరాజు ఎంఈవో సింహాచలానికి ఫోన్ చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో రాతపూర్వక ఆదేశాలు వస్తాయని, విద్యాశాఖ కమిషనర్ తరగతులను గింజర్తిలో కొనసాగించేందుకు అంగీకరించారని గ్రామస్తులకు వివరించారు. రెండు రోజుల్లో ఆదేశాలు పంపిస్తామని హామీ ఇచ్చారు.దీంతో గ్రామస్తులు సోమవారం వరకు ఆదేశాల కోసం వేచి చూస్తామని తెలిపారు. అప్పటిలోగా రాతపూర్వక ఆదేశాలు రాకుంటే తిరిగి దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రాతపూర్వక ఆదేశాలు రాకుంటే మళ్లీ దీక్షలు


