● సిలిండర్‌కు అదనంగా రూ.80 వసూలు
● మాడుగుల నుంచి ఎస్.కోట గ్యాస్‌ఏజెన్సీకి మార్చాలని గిరిజనుల విన్నపం
డుంబ్రిగుడ: భారత్ గ్యాస్ వినియోగదారుల కష్టాలు ఇంకా తీరడం లేదు. మండలంలోని వి. మాడుగుల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసిన నెల, రెండు నెలలకు సిలిండర్ అందజేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం భారత్ గ్యాస్ సిలిండర్ ధర రూ.950 ఉండగా, మాడుగుల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రూ.1,030 వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానికులు ప్రశ్నించగా.. మీ ఇష్టం.. మీరు ఎవరికి ఫిర్యాదు చేసినా మాకు ఏమీ కాదు. మేము అందించే గ్యాస్‌కు రవాణా ఖర్చులు వసూలు చేస్తున్నాం.. అని ఏజెన్సీ నిర్వాహకులు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎస్.కోటలోని లక్ష్మి గ్యాస్ ఏజెన్సీ వారు రూ.950 మాత్రమే తీసుకుంటుండగా, మాడుగుల గ్యాస్ ఏజెన్సీ వారు రూ.1,030 వసూలు చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్యాస్ కనెక్షన్లను ఎస్.కోట ఏజెన్సీకి మార్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మాడుగుల గ్యాస్ వాహనాన్ని డుంబ్రిగుడ వైపు రానివ్వబోమని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, గ్యాస్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


