పాడేరు రూరల్: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టికి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పాడేరులో ‘చలో ఢిల్లీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలని, ప్రజారోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు పెద్దపీట వేయాలని కోరారు. కార్మికుల హక్కులు, చట్టాలను వందశాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న అక్రమ దాడులను అరికట్టాలని అన్నారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించాలని కోరారు. ప్రజా హక్కుల పరిరక్షణలో భాగంగా భవిష్యత్ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు రాధాకృష్ణ, జల్లి రాజాబాబు, సింహాచలం, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
పొట్టికి సత్యనారాయణ


