ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో పసుపు సువాసన వెదజల్లుతోంది. గిరిజన ప్రాంతాల్లో పండించే పసుపునకు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. గ్రామాలకు సమీపంలోని కొండ, పోడు భూములతో పాటు పల్లంగా ఉన్న భూముల్లోనూ దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో పసుపు సాగుపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నాలుగు మండలాల్లో పసుపును అధికంగా సాగు చేస్తున్నారు.
అంతర పంటగా సాగు..
పెట్టుబడి తక్కువగా ఉండి ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో గిరిజన రైతులు పసుపును అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో 10 కావిళ్ల వరకు పసుపు నాటితే 20 నుంచి 25 కావిళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పసుపు ధర కూడా ఆశాజనకంగా ఉందని, బహిరంగ మార్కెట్‌లో కిలో పసుపు రూ.100 నుంచి రూ.140 వరకు పలుకుతోందని తెలిపారు. ఎకరాకు సుమారు రూ.8 వేల పెట్టుబడి పెడితే రూ.15 వేలకు పైగా లాభం వస్తోందని రైతులు పేర్కొన్నారు. వర్షాలు కూడా ఆశాజనకంగా కురుస్తుండటంతో దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
● ముంచంగిపుట్టు మండలంలో 1,845 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. డుంబ్రిగూడలో 1,250 ఎకరాలు, పెదబయలులో 3,815 ఎకరాలు, హుకుంపేటలో 2,556 ఎకరాల్లో పసుపు సాగవుతోంది.
సేంద్రియ పద్ధతిలో సాగు..
గిరిజన ప్రాంతాల్లో రైతులు సేంద్రియ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తుండటంతో పసుపులో కర్కుమిన్ శాతం 5 వరకు ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో పండించే పసుపుకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
● గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే వారపు సంతలకు వడ్డాది, మాడుగుల, అనకాపల్లి, కాకినాడ, తుని తదితర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంత వ్యాపారులు వచ్చి పసుపును కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మంచి డిమాండ్ ఉన్న పసుపు సాగుకు ప్రభుత్వం, ఐటీడీఏ ద్వారా పెట్టుబడి సాయం అందిస్తే సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుందని గిరిజన రైతులు కోరుతున్నారు.
ఒకప్పుడు సంప్రదాయ పంటగా మాత్రమే కనిపించిన పసుపు.. ఇప్పుడు గిరిజన రైతుల చేతుల్లో ఆదాయ పంటగా మారుతోంది.కొండలు, పోడు భూముల్లో సేంద్రియ పద్ధతిలో పండుతున్న ఏజెన్సీ పసుపునకుమార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు పసుపు సాగు వైపు మరింతగా మొగ్గుచూపుతున్నారు.
ఏజెన్సీ పసుపునకు గిరాకీ
లాభదాయకంగా ఆదాయం
సేంద్రియ విధానంలో పండించడం వల్ల మంచి డిమాండ్
సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు


