సాక్షి, పాడేరు: గిరిజనుల సమస్యలను అధికారులు ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జిరెడ్డి ఆదేశించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు సునీత, మల్లేశ్వరరావు, కృష్ణారావు, కిల్లో సాయిరామ్ గురువారం కలెక్టరేట్‌లో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు లేకపోవడంతో విద్యార్థులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ తెలిపారు. ఆయా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని, అటవీ హక్కు పత్రాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, ఏఎస్పీ శృతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్వో భుజంగరావు, గిరిజన సంక్షేమ డీడీ పరిమళ, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి


