కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: జిల్లాలో వర్తకుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన దుకాణదారుల ప్రత్యేక ఫిర్యాదుల కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలు, రుణాలను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలో బ్యాంకుల సహకారంతో రుణ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. అరకు, చింతపల్లిలోని ఎంఎస్‌ఎంఈ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో అర్హులైన ఔత్సాహికులకు దుకాణాలు కేటాయిస్తామని చెప్పారు. దుకాణదారులు, వీధి వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలని, గడువు ముగిసిన సామగ్రిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన కూడళ్లలో వీధి దీపాల పునరుద్ధరణ, పాడేరు శ్మశానవాటికలో మౌలిక వసతుల కల్పనపై వర్తకుల వినతులకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఏఎస్పీ శృతి మాట్లాడుతూ వ్యాపారులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని, పోలీసుశాఖతో సమన్వయం పెంచుకుని భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఆర్డీవో భుజంగరావు, డీపీవో చంద్రశేఖర్, సచివాలయాల నోడల్ అధికారి పీఎస్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


