జి.మాడుగుల : మండలంలోని పలు గ్రామాల్లో సాగుపై ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు గురువారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకురాలు డాక్టర్ డి. ఆదిలక్ష్మి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బాలహుస్సేన్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి గాయత్రి సంయుక్తంగా గొడ్డువలస, ఎం.నిట్టాపుట్టు గ్రామాల్లో పర్యటించారు. వర్షాల పరిస్థితులను బట్టి రైతులు పంటల ఎంపిక, సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ నెల మొదటి పక్షంలోపు వర్షాలు కురిసి నీరు అందుబాటులోకి వస్తే 40–45 రోజుల వయస్సున్న ముదురు నారును దగ్గరగా నాటుకోవాలని తెలిపారు. ఎరువులు వినియోగించే రైతులు ఎకరాకు ఒక బస్తా డీఏపీని నాటే ముందు దమ్మలో వేయాలని, 20 రోజుల తర్వాత మరో 20 కిలోల యూరియా వేయాలని సూచించారు. వర్షాలు ఆలస్యమైతే వరి సాగును నిలిపివేసి రాగిని నేరుగా వెదజల్లడం లేదా నారు పోసుకుని సాళ్లలో నాటుకోవాలని సూచించారు. రాగిలో అంతర పంటగా కంది సాగు చేయాలనుకునే రైతులు ప్రతి ఐదు సాళ్ల రాగికి ఒక సాలు కంది చొప్పున 5:1 నిష్పత్తిలో వేసుకోవచ్చన్నారు. పెసర, మినుములు వంటి ఆరుతడి పంటలను కూడా సాగు చేయవచ్చని తెలిపారు. రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.


