● ఆదివాసీ సాహిత్యంపై పరిశోధన.. భూషణం కథలపై పీహెచ్‌డీ
ముంచంగిపుట్టు: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి న ఓ ఉపాధ్యాయుడు పట్టుదలతో డాక్టరేట్ సాధించారు. ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీకి చెందిన వంతినిభ బాలాజీ ప్రస్తుతం హుకుంపేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల–1లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల ఆదివాసీ సాహిత్యంపై అధ్యయనం చేశారు. అనంతరం ఆచార్య జర్రా అప్పారావు ఆధ్వర్యంలో భూషణం కథలు–ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పరిశోధన కొనసాగించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన బాలాజీని కిలగాడ గ్రామ గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభినందించారు.


