కొయ్యూరు: గింజర్తిలోనే 3, 4, 5 తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షా శిబిరం వద్ద వంట వార్పు నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. ఆదర్శ పాఠశాలల పేరుతో గింజర్తిలో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను తొలుత చింతలపూడికి, అనంతరం లొద్దిపాకలకు తరలించడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం గత ఏడాది నుంచి కలెక్టర్‌కు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో రిలే దీక్షలకు దిగారు. రెండు రోజుల క్రితం ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఎంఈవో ద్వారా గింజర్తి గ్రామస్తులతో ఫోన్‌లో మాట్లాడారు. 3, 4, 5 తరగతులను గింజర్తిలో కొనసాగించేలా విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వస్తాయని, కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. దీక్షలు విరమించాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చే వరకు దీక్షలు విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. గింజర్తి గ్రామస్తులు, విద్యార్థులు చేస్తున్న దీక్షలకు గురువారం బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇలావుండగా 3,4,5 తరగతు లు కొనసాగించేలా కలెక్టర్ నిశాంతి ఉత్తర్వులు ఇచ్చారని ఎంఈవో సింహాచలం తెలిపారు.
తరగతుల కోసం తల్లిదండ్రుల పోరుబాట


