● ఇన్‌చార్జి పదవి నుంచి
తొలగించాలంటూ సంతకాల సేకరణ
● చేతులు కలిపిన మాజీ మంత్రి
మణికుమారి, కిల్లో రమేష్, ప్రసాద్
● ఆమెని కొనసాగిస్తే..
పార్టీ మనుగడ కష్టమంటున్న నేతలు
● గిడ్డిని తొలగించి.. ఎవరికి ఇచ్చినా..
పనిచేస్తామంటూ అల్టిమేటం
● గతంలో రాష్ట్ర కార్యదర్శి పదవిని
కొట్టగుళ్లి సుబ్బారావుకు ఇవ్వాలని
భావించిన అధిష్టానం
● ఆయనకు ఇవ్వొద్దంటూ సంతకాలు
సేకరణ చేపట్టి నిలిపేసిన గిడ్డి
● ఇప్పుడు అదే అస్త్రాన్ని గిడ్డిపై
సంధిస్తున్న తిరుగుబావుటా నేతలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
పాడేరు టీడీపీలో ముసలం మొదలైంది. ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జి గిడ్డి ఈశ్వరిపై అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ‘ఈమె మాకొద్దు’ అంటూ సొంత పార్టీ నేతలే కుంపటి రాజేశారు. ఆమె వ్యవహారశైలితో పార్టీకి నష్టం వాటిల్లుతోందని, ఇన్‌చార్జిల బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలంటూ తిరుగుబావుటా ఎగురవేశారు. సుదీర్ఘకాలంగా రగులుతున్న వర్గపోరు ఇప్పుడు బాహాటంగా రచ్చకెక్కింది. ప్రస్తుత ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష వ్యవహారశైలితో విసిగిపోయిన అసమ్మతి వర్గం ఏకంగా ఆమెని తప్పించాలంటూ గిడ్డి ఈశ్వరి మొదలుపెట్టిన సంతకాల సేకరణ అస్త్రాన్ని.. తిరిగి ఆమైపెనే సంధిస్తున్నారు.
‘గిడ్డి ఈశ్వరి నాయకత్వం మాకొద్దు.. ఆమెను ఇన్‌చార్జిగా కొనసాగిస్తే ఏజెన్సీలో పార్టీ మనుగడకే ముప్పు’ అంటూ సీనియర్ నేతలంతా ఏకతాటిపైకి రావడం పాడేరు టీడీపీలో కలకలం రేపుతోంది. ఎన్నాళ్లుగానో నివురుగప్పినట్లున్న అసంతృప్తి ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలైంది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న వర్గాలను ఏకం చేయాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, తానే ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విమర్శలు గిడ్డిపై తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న పాడేరు రాజకీయాల్లో.. ఏకంగా ఇన్‌చార్జిని తప్పించాలంటూ పోరుబాట పట్టారు.
రేగుతున్న అసమ్మతి జ్వాలలు.!
పాడేరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్న ఆందోళన క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. తాజాగా ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరికి వ్యతిరేకంగా పార్టీలోని కీలక నేతలంతా ఏకమయ్యారు. మాజీ మంత్రి మణికుమారి, సీనియర్ నేతలు కిల్లో రమేష్ నాయుడు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు చేతులు కలిపారు. ఈశ్వరిని బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఏకంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న అసమ్మతి నేతలు, క్యాడర్ నుంచి మద్దతు కూడగడుతూ అధిష్టానానికి పంపేందుకు ఈ సంతకాలు ముమ్మరంగా సేకరిస్తున్నారు.
ఆమె వాడిన అస్త్రాన్నే.. ఆమైపె ప్రయోగం.!
రాజకీయాల్లో ఎవరికి ఎదురైన అనుభవం వారికే తిరిగి రాకమానదన్న చందంగా ఇప్పుడు గిడ్డి ఈశ్వరి పరిస్థితి తయారైంది. గతంలో రాష్ట్ర కార్యదర్శి పదవిని అధిష్టానం కొట్టగుళ్లి సుబ్బారావుకు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఆ సమయంలో సుబ్బారావుకు ఆ పదవి ఇవ్వొద్దంటూ గిడ్డి ఈశ్వరి ఇదే తరహాలో సంతకాల సేకరణ చేపట్టారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఆయనకి ఆ పదవి రాకుండా చెయ్యడంలో అప్పట్లో ఆమె సఫలమయ్యారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని అస మ్మతి నేతలు ఆమైపెనే సంధించడం గమనార్హం. నా డు సుబ్బారావుపై ప్రయోగించిన ‘సంతకాల’ అస్త్రమే, నేడు గిడ్డి ఈశ్వరికి ఇబ్బందికరంగా మారిందని స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆమెను కొనసాగిస్తే కష్టమే..
అధిష్టానానికి అల్టిమేటం.!
గిడ్డి ఈశ్వరి నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ మనుగడ కష్టమని ఈ అసమ్మతి వర్గం కుండబద్దలు కొడుతోంది. ఆమె ఏకపక్ష నిర్ణయాలు, క్యాడర్‌తో సఖ్యత లేని ఒంటెద్దు పోకడల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోతోందని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘గిడ్డి ఈశ్వరిని తక్షణమే ఇంచార్జి పదవి నుంచి తొలగించాలి. ఆ స్థానంలో పార్టీలోని మరెవరికి బాధ్యతలు అప్పగించినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. కానీ, ఆమెను మాత్రం కొనసాగిస్తే సహించేది లేదు’ అంటూ అధిష్టానానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. దీంతో పాడేరులో వర్గ విభేదాలు రచ్చకెక్కినట్లయింది.


