● అధికారులు, సిబ్బందికికలెక్టర్ నిశాంతి ఆదేశం
● లక్ష్యసాధనపై సమీక్ష
పాడేరు: జిల్లాలోని అన్ని శాఖల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా విధులకు హాజరై బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీగా పనితీరు, లక్ష్యాల సాధన, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ఆమె సమీక్షించారు. గ్రామ సచివాలయ సిబ్బంది హాజరు శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వారం రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం గ్రామ సచివాలయాల హాజరు నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఏడీఎంహెచ్‌ఓలను ఆదేశించారు. ఇంజినీరింగ్ పనుల్లో పురోగతి తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక నివేదికతో పాటు కార్యాచరణ ప్రణాళికను అందజేయాలని సూచించారు. జిల్లా అధికారులు తమ శాఖల సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి లక్ష్యాలు, పురోగతి, పెండింగ్ అంశాలపై సమీక్షించాలని, సమావేశాల ఫొటోలను జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఏపీవో (పీవీటీజీ) వెంకటేశ్వరరావు, ఏవో హేమలతతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


