పాడేరు: ఆదివాసీల హక్కులు, రక్షణ చట్టాలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే నిర్బంధాలు చేయడం ఏమిటని మండిపడ్డారు. బుధవారం సాయంత్రం పాడేరులోని గిరిజన సంఘ కార్యాలయంలో ఆదివాసీ, గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఈ నెల 8న చేపట్టనున్న మన్యం బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. గిరిజనులను ఇబ్బంది పెట్టేందుకు బంద్ నిర్వహించడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే చేపడుతున్నామని తెలిపారు. జీవో నంబర్ 3 ద్వారా శతశాతం ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్ సాధన, 1/70 చట్టం పరిరక్షణ కోసం చేపడుతున్న బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. బంద్‌ను విరమింపజేసేందుకు శాంతియుత మార్గాలు ఉన్నప్పటికీ పోలీసు వ్యవస్థ ద్వారా అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. బంద్ నేపథ్యంలో గిరిజన విద్యార్థులను ఇళ్లకు పంపించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లపై పోలీసులు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై బంద్‌లు, నిరసనలు చేపడితే అడ్డుకుంటున్న పోలీసులు, ప్రధాని, ముఖ్యమంత్రి సభలకు విద్యార్థులను తరలించే సమయంలో మాత్రం మైనర్ల భద్రత గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ఈ నెల 7లోపు శతశాతం ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్, 1/70 చట్టం పరిరక్షణకు కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే మన్యం బంద్‌ను స్వచ్ఛందంగా విరమిస్తామని తెలిపారు. నిర్ణయాధికారం లేని హైపవర్ కమిటీల పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న జరిగే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్న పడాల్, ఆదివాసీ సేన జిల్లా ప్రతినిధి రాజు, నిరుద్యోగుల సంఘం ప్రతినిధి భాను, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ శ్రీను, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, సీఐటీయూ నాయకులు సుందర్‌రావు, గిరిజన సంఘ నాయకులు గంగాధరం, చిన్నారావు పాల్గొన్నారు.
పోలీసుల హెచ్చరికలు..
ముంచంగిపుట్టు: గిరిజన హక్కులు, చట్టాల అమలు, జీఓ నంబర్ 3కు చట్టబద్ధత, 1/70 చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనే డిమాండ్లతో ఈ నెల 8న గిరిజన ప్రజా సంఘాలు రాష్ట్ర మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్ సందర్భంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడరాదని, రాస్తారోకోలు నిర్వహించరాదని స్థానిక ఎస్‌ఐ పి.నాని గిరిజన ప్రజా సంఘాల నేతలను హెచ్చరించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ ముందస్తు పోలీసు అనుమతి లేకుండా బంద్ నిర్వహించడం చట్టవ్యతిరేకమని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, అత్యవసర సేవల వాహనాలు, సాధారణ ప్రజల రాకపోకలను అడ్డుకోరాదని, రోడ్లు, ఘాట్ రోడ్లు, చెక్‌పోస్టులను దిగ్బంధించడం నేరమని పేర్కొన్నారు. వర్తక, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలను బలవంతంగా మూసివేయించరాదని, బంద్ సందర్భంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు పోలీసు అనుమతి తప్పని సరి అని ఎస్‌ఐ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, రాకపోకలకు ఆటంకం కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా బీఎన్‌ఎస్ సెక్షన్లు 189, 126, 223తో పాటు పీడీపీపీ చట్టం కింద నిర్వాహకులు, పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గిరిజన ప్రజా సంఘాల నేతలకు నోటీసులు అందించారు. అయితే గిరిజన చట్టాలు, హక్కులు, జీవో నంబర్ 3కు చట్టబద్ధత, 1/70 చట్టం అమలుపై న్యాయపోరాటం చేస్తున్న తమను ముందస్తు హెచ్చరికలు, నోటీసులతో పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేయడం సరికాదని గిరిజన ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
8న మన్యం బంద్ విఫలయత్నానికి కూటమి కుయుక్తులు
సీఎం ఇచ్చిన హామీ
అమలు కోరితే నిర్బంధమా!
మన్యం బంద్ చేపట్టి తీరుతాం
అన్ని వర్గాలు స్వచ్ఛందంగాసహకరించాలి
ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స
ఆదివాసీ, గిరిజన, ప్రజా, విద్యార్థిసంఘాల ప్రతినిధులతో కలిసి
మన్యం బంద్ పోస్టర్ల ఆవిష్కరణ


