సీలేరు: అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లడం సమర్థవంతమైన చర్య అని సీలేరు రేంజ్ అధికారి ఎస్.వెంకటరావు తెలిపారు. సీలేరు రేంజ్ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో బుధవారం డ్రోన్ ద్వారా 20 వేల విత్తన బంతులను వెదజల్లినట్లు ఆయన వెల్లడించారు. సీలేరు అటవీ పరిధిలోని ధర్మాపురం, నిమ్మలగొంది, తొకరాయి, బంధవీధి, కొమ్ములువాడ పరిసర అటవీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 1.20 లక్షల విత్తన బంతులను జాఫ్రా, చింత, నేరేడు, రావి, మర్రి, కానుగ, తురకవేప తదితర వృక్షాల విత్తనాలతో తయారు చేసి అటవీ ప్రాంతాల్లో వెదజల్లాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే జూలై నెలలో సిబ్బంది, ప్రజల సహకారంతో వివిధ అటవీ ప్రాంతాలు, రైతుల పొలాల్లో లక్ష విత్తన బంతులను విజయవంతంగా వెదజల్లినట్లు ఆయన పేర్కొన్నారు. మిగిలిన 20 వేల విత్తన బంతులను డ్రోన్ సాయంతో వెదజల్లినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీలేరు రేంజ్ అధికారి ఎస్. వెంకటరావు, ట్రైనీ రేంజ్ అధికారి మణికృష్ణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం. రమణమ్మ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె. సతీష్‌తో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


