వంతెన ప్రతిపాదనకు అధికారుల హామీ
కశింకోట: మండలంలోని నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామం వద్ద పోలవరం కాలువలో మట్టి రహదారి తొలగింపు వ్యవహారంపై నెలకొన్న వివాదానికి బుధవారం తెరపడింది. కాలువపై వంతెన నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు కొద్ది రోజులుగా చేపట్టిన ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు నమ్మి గణేష్, నమ్మి నరసింగరావు, ఇతర స్థానిక నాయకులు పోలవరం ఈఈకి వినతిపత్రం అందజేశారు. ఆందోళన విరమించడంతో కాలువపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారిని పొక్లెయిన్ సహాయంతో అధికారులు తొలగించారు.


