గెడ్డ ఆక్రమణలకు అడ్డేది? | - | Sakshi
Sakshi News home page

గెడ్డ ఆక్రమణలకు అడ్డేది?

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

● పెద గొలుగొండలో నిర్మాణాలకుతెగబడుతున్న అక్రమార్కులు ● రోజురోజుకూ పెరుగుతున్న కబ్జాలు ● పట్టించుకోని అధికారులు

నాతవరం: మండలంలోని పెదగొలుగొండ గ్రామం మధ్యలో ఉన్న వెర్రిగెడ్డ కబ్జాదారులకు అడ్డాగా మారింది. కూటమి నాయకుల అండదండలతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వర్షం కురిసినప్పుడు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా ఈ గెడ్డ ద్వారా బట్రాజు నీల చెరువులోకి చేరుతుంది. ఈ గెడ్డ గ్రామం మధ్యలో అర్‌అండ్‌బీ రోడ్డును ఆనుకుని ఉండడంతో కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. కొంతమంది భారీ భవనాలు నిర్మిస్తుండగా, మరికొంతమంది రేకులు షెడ్డు వేసుకుని, తర్వాత సిమెంట్‌ పిల్లర్లతో భవనాలు నిర్మిస్తున్నారు. గ్రామం మధ్యలో ఉన్న ఈ స్థలానికి విపరీతమైన గిరాకీ ఉంది. గెడ్డను యథేచ్ఛగా కప్పేస్తుండడంతో చెరువులోకి ప్రవహించవలసిన నీరు నిలిచిపోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గెడ్డను పూర్తిగా ఆక్రమిస్తే నీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణ ఆరికట్టాలని కోరుతున్నారు.

ఆక్రమణదారుల మధ్య ఘర్షణ

గెడ్డ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న సమయంలో ఆక్రమణదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం ఇద్దరి మధ్య స్థలం విషయంలో తీవ్ర వివాదం జరిగింది. దీంతో ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీపంలో సచివాలయంలో ఉన్న పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement