4 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణ
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాల సేకరణ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దేవరాపల్లి: దేవరాపల్లిలో పట్టపగలే దొంగతనం జరిగింది. దేవరాపల్లి నుంచి బంగారమ్మ వెళ్లే రోడ్డుకు సమీపంలోని చొక్కాకుల ఎరుకునాయుడు ఇంటిలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ బుధవారం దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితుల కథనం మేరకు చోరీ ఘటన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి చెందిన చొక్కాకుల ఎరుకునాయుడు దంపతులు కూలి పనికి, పిల్లలకు స్కూల్‌కి వెళ్లిపోవడంతో అదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను పగలకొట్టి అందులో భద్రపరిచిన సుమారు 4 తులాల బంగారు అభరణాలు, సుమారు 20 తులాల వెండి పట్టీలు, సుమారు రూ.30 వేలు నగదును అపహరించుకుపోయారు. బాధితుడి చిన్న కుమార్తె యామిని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్లింది. ఇంట్లో బీరువా తలుపులు తీసి ఉండడాన్ని గమనించి కూలి పనికి వెళ్లిన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వెంటనే వాళ్లు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో దాచుకున్న బంగారు, వెండి అభరణాలు లేక పోవడంతో బోరున విలపించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఎరుకునాయుడు, భార్య దేముళ్లమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన ఇంటిని బుధవారం కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. అనుమానితులను విచారిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటితో పాటు పరిసర ప్రాంతంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలను సేకరించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


